1కొద్ది రోజుల తరువాత యేసు కపెర్నహూము పట్టణానికి తిరిగి వచ్చాడు. 2ఆయన ఇంట్లో ఉన్నాడని ప్రజలకు తెలిసింది. చాలా మంది అక్కడ గుమికూడారు. తలుపు దగ్గర కూడా చోటు లేకపోయింది. యేసు వారికి ఉపదేశం చేయసాగాడు.
3నలుగురు మనుషులు ఒక పక్షవాత రోగిని మోసుకుంటూ అక్కడికి తెచ్చారు. 4ప్రజలంతా గుమికూడిన కారణంగా రోగిని ఆయనకు దగ్గరగా తీసుకురాలేకపోయారు. అందువల్ల వారు ఆయన ఉన్న గది పైకప్పు ఊడదీసి, సందుచేసి, ఆ పక్షవాత రోగిని అతని పరుపుతో సహా యేసు ముందు దించారు.